వెంకటేశ్ కోసం 24 మంది అతిథులు.. ఏ సినిమా కోసమో తెలుసా!!
on Aug 23, 2023
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 24 మంది ప్రముఖులు.. ఒకే సినిమాలో, అది కూడా ఒకే పాటలో అతిథులుగా సందడి చేయడం అంటే మాములు విషయం కాదు. 36 ఏళ్ళ క్రితం 'టాక్ ఆఫ్ టాలీవుడ్'గా నిలిచిన అంశమిది.
ఆ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'నసీబ్' (1981) ఆధారంగా తెలుగులో 'త్రిమూర్తులు' పేరుతో సినిమాని నిర్మించారు ప్రముఖ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి. హిందీ వెర్షన్ లో అమితాబ్ బచ్చన్, శత్రుఘ్న సిన్హా, రిషి కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తే.. తెలుగు వెర్షన్ లో వెంకటేశ్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్ ఆ వేషాల్లో కనిపించారు. ఇక మాతృకలో "జాన్ జానీ జనార్థన్" అంటూ సాగే పాటలో రాజ్ కపూర్, షమ్మీ కపూర్, రణధీర్ కపూర్, ధర్మేంద్ర, రాజేశ్ ఖన్నా, రాకేశ్ రోషన్, విజయ్ అరోరా, వహీదా రెహ్మాన్, షర్మిలా ఠాగూర్, మాలా సిన్హా, బిందు, షిమి గేర్వాల్, సింపుల్ కపాడియా, ప్రేమ నారాయణ్ ఇలా 14మంది ప్రముఖులు అతిథులుగా మెరిస్తే.. "ఒకే మాట ఒకే బాట" అంటూ సాగే తెలుగు వెర్షన్ పాటలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి మారుతీరావు, పద్మనాభం, ఎ. కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, విజయనిర్మల, శారద, రాధిక, విజయశాంతి, రాధ, భానుప్రియ, సుమలత, జయమాలిని, అనూరాధ, వై. విజయ ఇలా 24 మంది ప్రముఖులు గెస్ట్స్ గా సందడి చేశారు. కలర్ ఫుల్ గా సాగే ఈ గీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
కాగా, కె. మురళీ మోహన రావు దర్శకత్వం వహించిన 'త్రిమూర్తులు'.. 1987 జూన్ 24న ప్రేక్షకుల ముందు నిలిచింది.
Also Read